భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు,పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలలో తమ తల పై పెట్టుకుని, డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడ్కొని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్ళే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమ లేక కడి (తెల్ల ముగ్గు) తో అలంకరించి, దానిపై ఒక గండదీపం ఉంచడం జరుగుతుంది. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కల ఈ దేవి గుళ్ళను దేదీప్యమానంగా అలంకరిస్తారు.
బోనాలతో ప్రదక్షిణాలు చేస్తున్న మహిళలు ‘బోనాలు’ [అమ్మవారు]ని పూజించే ఈ పండుగ ప్రధానంగా సికింద్రబాద్ మహంకాళి బోనాలు ముగిసిన వారం రోజుల తరువాత గ్రామస్థులందరూ జూలై లేక ఆగష్టులో వచ్చు ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ రోజు జగజ్జనని మహంకాళి దేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. భోజనం ప్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామదేవతలకు సమర్పించే నైవేద్యమే బోనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తిప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్నముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్వె పెట్టి బోనంజ్యోతి వెలిగించి జాతర కన్నులపండుగగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలుకట్టివ్యాధి నిరోధకశక్తిని పెంచే పసుపు కలిపిన నీరు, వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామదేవత ఆలయానికి తరలివెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం.అమ్మవారి ఆకారములో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయక వస్త్రధారణ, ఒంటి పై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తాడు.ఇలా గ్రామంలోని ప్రతి ఇంటి నుండి చిన్నా పెద్ద,ధనికా బీద అనే తేడా లేకుండా రంగ రంగ వైభవంగా భక్తి శ్రద్దలతో పాడి పంటలు, పశు సంపద,ఆయురారోగ్యాలు ,సకల సంపదలు కలగాలని గ్రామ ఇలవేల్పు శ్రీ జగజ్జనని మహంకాళి అమ్మవారిని వేడుకుంటూ పూజకార్యక్రమాలు జరుపుకుంటారు